
కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలో మహిళా సంఘాలకు 27 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండగా, ప్రభుత్వ ఆదేశాలతో మరో 156 సెంటర్లను అప్పగిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో వడ్ల కొనుగోలుపై మహిళా సంఘాల గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు, సబ్ కమిటీ, సిబ్బందికి ట్రైనింగ్ పోగ్రాంలో కలెక్టర్ మాట్లాడారు. సెంటర్లకు కావాల్సిన సామగ్రిని సమకూర్చుకుని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లను కొనాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల బాధ్యతను అప్పగించిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వి. విక్టర్, డీఆర్డీవో సురేందర్, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీసీవో రాంమోహన్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అలర్టుగా ఉండాలి..
ఎండల తీవ్రత దృష్ట్యా అధికారులు అలర్టుగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జరిగిన టాస్క్‌పోర్స్ కమిటీ మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పల్లె, పట్టణాల్లో ఓఆర్ఎస్ ఫ్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తాగునీటికి ఇబ్బంది కలుగకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీసీహెచ్‌వో విజయలక్ష్మి, సీపీవో రాజారాం తదితరులు పాల్గొన్నారు.